సీజేపీకి ఎప్పటికీ మద్దతివ్వం.. వివాదంపై అన్నామలై క్లారిటీ

సీజేపీకి ఎప్పటికీ మద్దతివ్వం.. వివాదంపై అన్నామలై క్లారిటీ

చెన్నై: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వాన్ని  విమర్శించిన తమిళనాడు బీజేపీ మాజీ  అధ్యక్షుడు కె. అన్నామలై తాజాగా తన వ్యాఖ్యలపై క్లారిటీ  ఇచ్చారు. సీజేపీకి తాము మద్దతు ఇవ్వడం లేదని, ఆ పార్టీ అజెండా తమ అజెండా వేర్వేరని స్పష్టం చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి తన హక్కుల కోసం పోరాడే అవకాశం ఉండాలన్నారు.

అక్టోబర్ 22న తన ‘వీ ద లీడర్స్’ ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నామలై మాట్లాడారు. సీజేపీ నిరసనకారులపై అక్టోబర్ 10న పోలీసులు చేపట్టిన చర్యలను ఆయన గతంలో విమర్శించడంతో బీజేపీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తన వైఖరిని వివరిస్తూ.. సీజేపీకి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని అన్నామలై తెలిపారు. భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వం గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, దేశభక్తి గురించి ఎవరూ తనకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

సీజేపీ నిరసనకారులు ఏదైనా తప్పు చేసి ఉంటే చట్టం ప్రకారం, న్యాయపరమైన విధివిధానాలను అనుసరించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు.“అరెస్టులు చట్టానికి, సరైన న్యాయ ప్రక్రియకు అనుగుణంగా జరగాలని మేము విశ్వసిస్తున్నాం అని అన్నామలై తెలిపారు .

దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఉంటే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) వంటి సంస్థలను ఉపయోగించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. అంతేకానీ, సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) నిరాధారమైన అనుమానాలను సృష్టించడం సరికాదని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అంగీకరించలేమని అన్నామలై స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ పనితీరును ప్రశంసించిన ఆయన.. మోదీ మంచి ప్రధానిగా దేశానికి మేలు చేసే పనులు చేస్తున్నారని అన్నారు. అయితే ప్రధానిని సమర్థిస్తున్నంత మాత్రాన తప్పుగా అనిపించిన అంశాలను ప్రశ్నించకుండా ఉండబోమని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీకి మద్దతు ఇస్తూనే, ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులు కనిపిస్తే వాటిని ప్రశ్నించే హక్కు తమకు ఉంటుందని అన్నామలై వ్యాఖ్యానించారు.